![]() |
![]() |

బాలీవుడ్ బాద్‌షా, కింగ్ షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తన పెర్ఫార్మ్ తో అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు , నిజ జీవితంలో ఆయనకున్న సమయస్ఫూర్తి, చమత్కారం కోట్లాది మంది అభిమానులని సంపాదించిపెట్టాయి. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ పాల్గొన్నాడు. దీంతో తమ అభిమాన హీరోని ప్రత్యక్షంగా చూడాలనే కోరికతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు మంగళూరుకి తరలివచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి మొదలుకొని ఈవెంట్ వేదిక వరకు అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ ఈవెంట్‌లో షారుఖ్ తన అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లతో అలరించడమే కాకుండా, అక్కడికి వచ్చిన ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించారు.
ఆ సమయంలో ఒక వివాహిత షారుఖ్ తో 'షారుఖ్ నా భర్త కంటే కూడా మిమ్మల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పేసింది. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా కేరింతలు కొడుతూ అల్లరి చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో బాలీవుడ్ బాద్‌షా ఏమాత్రం తడబడకుండా, తనదైన ట్రేడ్‌మార్క్ డింపుల్ చిరునవ్వుతో స్పందించారు. నవ్వుతూనే ఆమెతో, "ఇలాంటి పర్సనల్ విషయాలు అందరి ముందూ కాకుండా ఒంటరిగా చెప్పాలి కదా!" అంటూ చమత్కరించారు. షారుఖ్ ఇచ్చిన ఈ రిప్లై వినగానే అక్కడ ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
అయితే అంతటితో ఆపకుండా, ఆ మహిళా అభిమాని ఇబ్బంది పడకుండా పరిస్థితిని ఎంతో వినయంతో, సున్నితంగా హ్యాండిల్ చేశారు షారుఖ్. ఆయన వెంటనే ఆ అభిమానిని ఉద్దేశిస్తూ.. "మీ మనసులోని గాఢమైన భావాలు నాకు అర్థమయ్యాయి. ఇది కేవలం ఒక అభిమానంతో కూడిన మాట అని నేను భావిస్తున్నాను. కచ్చితంగా మీ భర్త కూడా మీ మనసులోని ఈ అభిమానాన్ని అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. నేను మీ అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాను. మీతో పాటు మీ భర్తను, మీ మొత్తం కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాను. నాకు ఇంతటి అపారమైన ప్రేమని అందిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ ఎంతో హుందాగా సమాధానమిచ్చారు. దీంతో హాల్లో ఉన్నవారంతా చప్పట్లతో కింగ్ ఖాన్ వ్యక్తిత్వాన్ని అభినందించారు.
Also read: తెలుగు హీరోయిన్ క్రేజీ ఆఫర్.. అది ఇష్టపడేవాళ్లు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి
ఈ పర్యటనలో మంగళూరుతో తనకున్న పాత జ్ఞాపకాలను కూడా షారుఖ్ పంచుకున్నారు. తాను 1965లో జన్మించినప్పటికీ, చిన్నతనంలో మొదటి 5 సంవత్సరాలు అంటే 1965 నుండి 1970 వరకు తన తాతగారైన ఇఫ్తికార్ అహ్మద్‌తో కలిసి ఇదే మంగళూరు నగరంలో గడిపినట్లు తెలిపారు. తన చిన్ననాటి ఫోటో ఒకటి చూపిస్తూ.. సబ్బు బుగ్గలతో టబ్‌లో కూర్చున్న ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి నటిస్తున్న తన అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కింగ్' షూటింగ్ విరామంలో ఆయన ఇక్కడికి రావడం విశేషం.
![]() |
![]() |